Wednesday, August 16, 2006

ఆద్యాత్మికం

ఈ blogspot అప్పుడప్పుడూ స్థిరంగా వుండకపోవటం మూలాన నేను wordpress కి వలస పోయాను. ఆ తర్వాత "నా పలుకు" ను అనాధగా వదిలేశాను. ఇకా ఇందులో కూడా నా బ్లాగులు చూడొచ్చు.
దేవుడున్నాడా? బ్లాగులోని ప్రశ్నలకు రోహిణీ ప్రసాద్ గారు మరియు రామనాధ్ గారు చక్కటి జవాబులు చెప్పారు.
పుణ్యాత్ముని మరియు దుర్మార్గుని పట్ల డేవుడు ఒకే పక్షపాతం చూపిస్తాడా?
చూపిస్తాడు. అసలు దేవుడికి పుణ్యం, పాపం తెలియవు. ఎండ, గాలి, వెన్నెల అందరినీ ఎలా సమానంగా చూస్తాయో దేవుడూ అట్లానే. వెన్నెల అందరికీ ఒకేలా కాచినా కవికి కనిపించినంత అందంగా పామరుడికి కనిపించకుంటే భేదం మనిషి మనసులో వుందే గానీ దేవుడిలో లేదు.

పాప పుణ్యాల కర్మ పలితాలు తర్వాతి జన్మలకు అనుసరిస్తాయా?
ఏ కర్మ పలితం ఆ జన్మకే పరిమితం. ఈ రోజు మనం చేసిన ఒక పుణ్యకార్యం (పూజలూ, వ్రతాలూ పుణ్యకార్యాలు కాదు) రేపు మనకు మేలు చేయవచ్చు. ఎలాగంటే, అప్పుడెప్పుడో ఒకనికి మా నాన్న సహాయపడ్డాడని ఈ రోజు అతను నాకు సహాయపడటం. ఆ రోజు మా నాన్న చేసిన పుణ్యం ఈ రోజు నాకిలా లబ్ది చేకూర్చిందన్నమాట. అలాగే పాపమూనూ, అప్పుడెప్పుడో నీవు కొట్టిన వాడు ఈ రోజు interview boardలో సబ్యుడుగా వుంటే నీవు పాపపలితం అనుభవించక తప్పదు. ఇలా మనం చేసిన పాపపుణ్యాల పలితాలు మనమో, మన పిల్లలో ఈ భూమిమీద అనుభవించాల్సిందే తప్ప తర్వాతి జన్మలూ లేవు..అనుసరించే తతంగమూ లేదు.

అసలు పునర్జన్మలంటూ ఉన్నాయా?
మానవ జన్మే అన్ని జన్మలకూ వున్నతమయింది అయితే, మానవ జన్మే ముక్తి మార్గానికి అనుకూలమయిందయితే మని మానవ జన్మలు స్థిరంగానైనా వుండాలి లేదా తగ్గాలి గానీ ఇలా పెరుగుతూ ఎలా పోతాయి?సంబోగము, అండోత్పత్తి, ప్రసవము, జీవము ఇవన్నీ ఈ పేద్ద ప్రకృతి ప్రోగ్రాంలో ఒక బాగం. ఆ script ప్రకారం అన్నీ అలా జరుగుతూ వుంటాయి. శరీరం నశించడం తోనే శరీరానికున్న చలన స్వబావమూ, ఆలోచించే తత్వమూ అన్నీ నశిస్తాయి. పంచ భూతాలతో ఏర్పడిన శరీరము పంచ భూతాలతో కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిన వన్నీ మళ్ళీ recycle చేయబడతాయి అయితే అలా recycle చేయబడి ఉత్పత్తి కాబడ్డ వస్తువుకి ఏవిదంగానూ తన ముందుతరపు గుణాలంటే ప్రశ్నే లేదు.

ఏది పాపం? ఏది పుణ్యం?
మహా భారత సూక్తిలా "నీకేది బాధ కలిగిస్తో అది ఇతరులకు చేయక పోవటం, నీకేదీ హాయినిస్తుందో అది ఇతరులకూ పంచటం" పుణ్యం."నీకు బాధ కలిగించేది ఇతరులకు తలపెట్టడం పాపం."

జన్మ యొక్క పారమార్థికత ఏమిటి?
జన్మించిన తర్వాత ఏమి చేసినా, ఏమీ చేయకున్నా ప్రకృతి మాత్రం తనపని తను చేస్తూనే వుంటుంది. శరీరం నశిస్తుంది, చలనత్వం పోతుంది.చచ్చే ముందు తర్వాతి తరం వారి జీవితాలను మరింత సుఖమయం చేయగలిగే ఏపని చేసినా జన్మ యొక్క పరమార్థం సిద్దించినట్లే.

మోక్షం అనగా ఏమిటి?
అది ఎలా సిద్దిస్తుంది?జన్మ, పునర్జన్మ చక్రం లోంచి బయట పడటం మోక్షమంటాయి వేదాలు. బయటపడి నాకు నేను మోక్షం పొందితే మానవ జన్మలు ఆగిపోవే! మానవులు పుడుతూనే వుంటారు, కష్టాలు పడుతూనే వుంటారు. వేదాల లెక్కన మనం మోక్షం పొందితే కష్టాలు పడే మానవులకి ఆసరా అందించకుండా తప్పుకున్నవాళ్ళమవుతాం.జీవితకాలంలో చేసిన మంచి పనులవల్ల ఆత్మతృప్తి కలిగి మరణించేటప్పుడు సంతృప్తిగా మరణిస్తే అది మోక్షం కలగడం. ఆ చిట్టచివరి తృప్తి తర్వాత ఏమీ లేదు.

ఇహ లోకంలో లేని స్వర్గనరకాలు పరలోకంలో ఉన్నాయా?
లేవు. అన్నీ ఇక్కడే వున్నాయి. దావూద్ లాంటి వాళ్ళు తప్పులు చేసి తప్పించుకొంటున్నామనుకుంటే పొరపాటే. ఒకసారి శివుడుకీ, శనికీ ఏదో గొడవ వచ్చిందట. నీవు నన్నేమీ చేయలేవు అన్నాడు శివుడు. నేను తలుచుకుంటే నిన్నైన ముప్పతిప్పలు పెట్టగలనన్నాడు శని. అలా వాదించుకున్నాక ఏదీ నన్నేం చేస్తావో చూస్తానంటూ కైలాసం వదిలి ఒక భయంకరమైన అడివిలో ఓ చెట్టు తొర్రలో నివాసమున్నాడట కొన్నాళ్ళు, అక్కడైతే శని తనని కనిపెట్టలేడని.ఒక వారం తర్వాత బయటకొచ్చి శనిని పిల్చి నీవు నన్నేమీ చేయలేకపోయావు అన్నాడు. అందుకు శని "నా ప్రభావం లేనిదే నీవు చల్లని కైలాసం వదిలి చెట్టు తొర్రలో నక్కావా?" అన్నాడట.అలా అజ్ఞాతంలో, భయం నీడలో బతకడం కూడా ఒక నరకమే. ఆతని పాప పలితాలు అతని పిల్లలనీ చుట్టుకుంటాయి తర్వాత.

వివిధ మతాలు మనిషిలో పాపభీతి కలిగించుటలో ప్రవక్తల, సాదు జనుల, దైవావతారుల అంతర్లీన భావ మేమిటి?
శిక్ష వుంది అంటేనే తప్పు చేయడం మానే పిల్లల్లాంటివారు అధికమంది ప్రజలు గనుక. తప్పుకు కఠిన శిక్షలు అందుకే. పాపమూ లేదు, పునర్జన్మా లేదు, అంటి వచ్చేదీ లేదు అంటే ఏ తప్పుచేసినా కోర్టూ లేదు, తీర్పూ లేదుజైలూ లేదు అనడం లాంటిది. ప్రతి తప్పునూ చూడటానికి ప్రతి ఒక్కడి వెంటా ఒక పోలీసును ఎళ్ళవేళలా వుంచలేము. అదే భయమనే పోలీసును అతడి మనసులోనే పెడితే అదే కాపాడుతుంది తప్పును చేయనివ్వకుండా.

డేవుడు నిర్వికారుడూ, నిర్గుణాకారుడా?
దేవుడు నిర్వికారుడే. కానీ గుణం లేకపోవటమనే గుణమున్నవాడు. మనిషికి అవసరానికి అబద్దమాట్లాడటమూ తెలుసు. కానీ దేవుడికి ఎళ్ళవేళలా సత్యం మాట్లాడమే వచ్చు. గుణముంది, అదే సత్యమే మాట్లాడాలన్నది కానీ విచక్షణ లేదు. రోజూ వర్షం కురిసే చోట "ఈరోజు వర్షం కురుస్తుంది" అన్నది వార్త ఎలా కాదో, విచక్షణ లేక ఎన్ని గుణాలున్నా గుణహీనుడే.

అతని పేరు మీద భజనలు, భక్తి, తంత్రాలు, మంత్రాలు అవసరమా?
అస్సలవసరం లేదు.
దేవుడు భజనలకీ, పూజలకీ, వ్రతాలకీ లొంగడు. "7 habits of highly effective people లో ఈ కథ వుంది.సముద్రమంతా పొగమంచు కమ్ముకొని వుంది. ఎక్కువ దూరం కనిపించటం లేదు. ఇంతలో నౌక కెప్టన్‌కి వార్త వచ్చింది. దూరంగా ఏదో లైటు వెలుగుతోంది, ఏదో నౌకలా వుంది అని. కెప్టెన్: అది కదులుతూ వుందా స్థిరంగా వుందా?నావికుడు: కదలటం లేదు నిశ్చలంగా వుంది.కెప్టెన్: 20 డిగ్రీలు పక్కగా కదలమని సమాచారమివ్వు. లేకుంటే డీకొట్టుకొనే ప్రమాదముంది.నావికుడు: డికొట్టుకొనే ప్రమాదముంది. 20 డిగ్రీలు పక్కకు జరగండి.అటువైపునుండి: నేను జరగను. మీరే 20 డిగ్రీలు పక్కకు మరలండి.కెప్టెన్: నేను నౌక కెప్టెన్ చెప్తున్నాను, 20 డిగ్రీలు పక్కకు జరగండి.అటువైపునుండి: నేనూ అధికారినే, మీరే పక్కకు జరగండి.కెప్టెన్: మాది సైనిక ఓడ. పక్కకు జరగక పోతే పర్యవసానం ఎదుర్కోవాల్సివుంటుంది, పక్కకు జరగండి.అటువైపునుండి: ఇది దీప స్థంబము (light house).
ఇక కెప్టెన్ అయినా నౌకలో వుండేది దేశాద్యక్షుడైనా పక్కకు జరగాల్సిందే. దీప స్థంబము పక్కకు జరగదు. దేవుడూ అంతే పూజలూ, వ్రతాలూ, యజ్ఞాలూ, యాగాలూ ఏమీ చేయలేవు.

భజన అన్య విషయాల మీద మనసు పోకుండా వుంచుతుంది. అచంచలమైన భక్తి ఒక భ్రాంతిలో ముంచుతుంది. తంత్రాలూ, మంత్రాలూ ఆ బ్రాంతిని చేరుకోవడానికి సాధనాలవుతాయి. ఇవన్నీ కూడా ఎవరికి వారు తమదైన బ్రాంతిని నిర్మించుకొని అందులో జీవితాన్ని నిష్పలంగా ముగించడానికి తప్ప పరులకు ఉపయోగపడేదేమీలేదు. పరులకు వుపయోగపడని ఏ పూజా, కర్మా కూడా నిష్పలం. పిల్లవాడు బొమ్మలతో ఆటాడుకొన్నట్లు.

ఏది అసలైన దైవ సేవ?నరసేవే నారాయణ సేవ. జీవి సేవే పరమాత్మ సేవ."live let live"
అసలు పాపభీతితో దైవసేవ చేయటం అవసరమా?రామనాధ రెడ్డి అన్నట్లు, గూండాను భయంతో మొక్కినట్లే పాపభీతితో దైవసేవ చేయటం. ఎవరికి వారు జవాబుదారీ. ఏది తప్పో ఏది ఒప్పో నీకు తెలుసు. చేసేది చేసి ఆనక తప్పు చేశాను క్షమించమంటే క్షమించడానికి దేవుడు మనిషి కాదు.
-- ప్రసాద్
http://charasala.wordpress.com/