Monday, June 05, 2006

ఉచల్యా - లక్ష్మణ్ గాయక్‌వాడ్ ఆత్మకథ ( uchalya )


ఉచల్యా - లక్ష్మణ్ గాయక్‌వాడ్ ఆత్మకథ
మన మద్యనే మనకు తెలియని ప్రపంచం ఎంత ఉంది?
ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదివి తీరవలసిన పుస్తకం. దాదాపు ఇప్పుడు ఇంటెర్నెట్లో ఇది చూస్తున్న ప్రతిఒక్కరు తమ బాల్యంలో తిండికి గతిలేనివారు మాత్రం అయి ఉండరు. అలాగే తిండికి లేని వారిని, బిచ్చమెత్తుకునే వారిని చూసి ఉంటారు గాని.. వాళ్ళ జీవితాన్ని, కష్టాలను, ఆకలిని గూర్చి తెలుసుకోవాలంటే మాత్రం ఈ పుస్తకం చదివి తీరవలసిందే.
నాకు ఏడ్పు తెప్పించిన కొన్ని పేరాలు చదవండి.
"స్కూలుకి నేను వెళ్తూనే ఉన్నాను. కాని ఇంటి దగ్గర తినడానికి మాత్రం తిండిలేదు. ఒక్కొక్కసారి నాలుగైదు రోజులు ఇంట్లో పొయ్యి కూడా వెలిగించేవాళ్ళం కాదు. నేను అందరిలోకి చిన్నవాడినని నాన్న తను పనిచేసే చోటికి పిలిచేవాడు. యజమాని తనకు ఇచ్చిన రొట్టెలలో సగం నాకు ఇచ్చేవాడు. నాన్న సగం కడుపు నింపుకుని లేచేవాడు. అప్పుడప్పుడు ఇంట్లో బోలెడు నీళ్ళు పోసి గటిక కాచేవాళ్ళము. ఒక్కొక్కసారి అది కూడా దొరికేది కాదు. మా ఇంట్లో మనుషులు ఎక్కువ సంపాదన తక్కువ. రేషన్ దుకాణం నుండి ఎర్ర జొన్నలు తెచ్చుకునేవాళ్ళం. ఆ జొన్నల్లొ బోలెడు పురుగులు ఉండేవి. మాకు ఎంత ఆకలి వేసేదంటే పురుగులు ఉన్నా సరే వేడి వేడిగ ఉన్న ఆ గటికను తాగేవాళ్ళం. అందరికి నాలుగు నాలుగు చెంచాలకన్నా ఎక్కువ వచ్చేది కాదు. ఇద్దరన్నయ్యల్లో ఎవరో ఒకరు నాకు మళ్ళీ కాస్తో కూస్తో గటిక ఇస్తారని వాళ్ళతోబాటు నేను కూర్చొనేవాడిని. కాని మా వదినలకి అన్నయ్యల భాగం నేను తినడం ఇష్టం ఉండేది కాదు. నన్ను తిట్టేవాళ్ళు. నేను సిగ్గులేనివాడిలాగా అట్లాగే కూర్చుండేవాడిని. నేను కంచాలు కూడా నాకే వాడిని. అయినా నాకు ఆకిలి తీరేది కాదు. గిన్నెలో అడుగున మాడిన చెక్కల సైతం గీక్కుని గీక్కుని తినేవాడిని. ఒక్క పూట అయినా కడుపునిండా అన్నం దొరికేది కాదు.
...
"ధోండాబాయి పోలీసుల కాళ్ళు పట్టుకుంది. వాళ్ళు బూట్లతో తన్నడం మొదలు పెట్టారు. "నిన్న లాతూరులో ఎవడో జేబు కొట్టేసాడు. ఐదొందుల రూపాయలు పోయాయి. నీ పిల్లలు తీసుకు వచ్చారు. చెప్పు వాళ్ళెక్కడ ఉన్నారో, ఆ డబ్బు తీసుకురా లేకపోతే జైళ్ళో పడేస్తాం." అని పోలీసులు బెదిరించారు. "ఐదొందలు తెచ్చి ఇవ్వు. మేం పాటిల్ దగ్గర ఉంటాం." అని అన్నారు. నాన్న యజమాని దగ్గరకు వెళ్ళి సంవత్సరం జీతం తీసుకు వచ్చాడు. అమ్మ ఒక షావుకారు దగ్గర వారంకి ఐదు రూపాయల వడ్డీ చొప్పున పైసలు తెచ్చింది. పోలీసులు బాగా తాగి వచ్చారు. అమ్మ పైసలు ఇచ్చింది. వీళ్ళందరిని జైలుకు తీసుకు పోదాం అని పోలీసులు అరవడం మొదలు పెట్టారు. ఓ దుప్పటి కాసిన్ని గిన్నెలు తీసుకున్నారు. "మై బాప్ మా పిల్లవాడు దొంగతనం చేయలేదు కేసు పెట్టకండి" అని నాన్న పోలీసులతో అన్నాడు. పోలీసులకు పైసలు ఇచ్చాక మమ్మల్ని విడిచి వేసారు."
...
ఇలాంటివి ఇందులో ఎన్నో ఉన్నాయి. మన పక్కనే ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే చుస్తూ ఊరుకుని, ఏమీ పట్టనట్టు, తెలియనట్లు, తెలిసినా కాసిన్ని కన్నీరు కార్చి, అలంటి బుక్ వ్రాసిన వాన్ని హీరోని చేసి లేదా అలాంటి సినిమాని సూపర్ హిట్ చేసి.. మన పని అయిపోయింది అనుకుంటున్నాం. మనకు మనమే ద్రోహం చేసుకుంటున్నాం.
వీటికి ఎదురి నిల్చి పోరాడే ధైర్యం ఎంతమందికి ఉంది? కనీసం మన చుట్టు జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని కొంతవరకైనా ఆపగలమా?
ఎంతసేపు మన పొట్ట, మన పిల్లలు, మన ఆస్తి చుసుకోవడంలోనే జివితం అంతా ఖర్చు ఐపోతోంది. ..

0 Comments:

Post a Comment

<< Home